అన్ని వ్యవస్థలకూ లక్ష్మణరేఖ

కేసులను పరిష్కరించినప్పుడు, వాదనలను వింటున్నప్పుడు న్యాయమూర్తులు కేసుకు సంబంధించిన విషయాల మీదే తమ దృష్టిని కేంద్రీకరించాలి. వాటికి సంబంధించి మాత్రమే వ్యాఖ్యానాలు ఉండాలి. ఆ వ్యాఖ్యానాలు కూడా తీర్పుల్లో ప్రతిబింబించాలి తప్ప వాదనలు వింటున్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. ఈ మధ్య ఓ కొత్త పద్ధతి వృద్ధి చెందుతున్నది. అదే నోటి మాట ద్వారా ఉత్తర్వులు ఇచ్చే పద్ధతి. ఇది ఎంతమాత్రం అభిలషణీయం కాదు. నోటి మాట ద్వారా ఉత్తర్వులు ఇచ్చే పద్ధతి వల్ల విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉంది. తీర్పులు, ఉత్తర్వులు తగు కారణాలతో ఉండాలి. తగు కారణాలు ఉన్నప్పుడు తాము కేసు ఎందుకు ఓడిపోయామో, గెలిచామో తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్పీలుకు వెళ్లడానికి అవకాశం ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది. నోటి మాట ద్వారా ఉత్తర్వులు, తీర్పులు ఇస్తే పార్టీలకు నష్టం జరుగుతుంది.

లక్ష్మణరేఖ అన్ని వ్యవస్థలకూ ఉంటుంది, ఉండాలి కూడా. న్యాయవ్యవస్థే అందుకు మినహాయింపు కాదు. న్యాయమూర్తులు న్యాయాన్ని అమలుచేయాలి.

అంతేకాదు రాజ్యాంగం, శాసనాలు నిర్దేశించిన మేరకు న్యాయమూర్తులు తమ పాత్రను నిర్వహించాలి. అంతకుమించి ఏ మాత్రం ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఒకవేళ వారు ఆ విధంగా చేస్తే వారు రాజ్యాంగాన్ని అగౌరపరిచినట్టే అవుతుంది. ఈ మాటలు అన్నది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కురియన్ జోసెఫ్.

ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతున్న మాటలు వ్యాఖ్యానాలు వింటే వాళ్లు లక్ష్మణరేఖను దాటుతున్నట్టు అన్పిస్తున్నది. కురియన్ జోసెఫ్ ఇంకా ఇలా అన్నారు. న్యాయమూర్తులు చట్టానికి, శాసనాలకు అంకితమై ఉండాలి. వాళ్ల దృష్టి కేసు వైపు, కేసులోని విషయాల పట్ల ఉండాలి తప్ప మరోవైపు ఉండకూడదు.

బ్రేకింగ్ వార్తల వైపు న్యాయమూర్తుల దృష్టి ఉండకూడదు. రాజకీయ నాయకుల పాత్రను, కార్యనిర్వాహక రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులు ప్రవర్తించకూడదు. తమ చేతిలో ఉన్న కేసు పరిష్కారం వైపు న్యాయమూర్తులు తమ దృష్టిని కేంద్రీకరించాలి. తమ నిర్ణయాలను మీడియా ఏ విధంగా చూస్తుంది అన్న విషయాల మీద న్యాయమూర్తులు తమ దృష్టిని కేంద్రీకరించకూడదు.

తమ వ్యక్తిగత అభిప్రాయాలతో కేసులను పరిష్కరించకూడదు. శాసనం చెప్పిన పరిధిలో వాటి ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ న్యాయమూర్తులు బ్రేకింగ్ వార్తలవైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తే మీడియా వాటిని పట్టించుకోకూడదు. కేసులను పరిష్కరించినప్పుడు, వాదనలను వింటున్నప్పుడు న్యాయమూర్తులు కేసుకు సంబంధించిన విషయాల మీదే తమ దృష్టిని కేంద్రీకరించాలి.

వాటికి సంబంధించి మాత్రమే వ్యాఖ్యానాలు ఉండాలి. ఆ వ్యాఖ్యానాలు కూడా తీర్పుల్లో ప్రతిబింబించాలి తప్ప వాదనలు వింటున్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. అలా చేస్తే మీడియా వాటిని వక్రీకరించే అవకాశం ఉంది. ఆ కేసుల్లోని పార్టీలు ఆందోళనలకు లోనయ్యే అవకాశం ఉంది.

వ్యక్తిగత విశ్వాసాలు తమ తీర్పుల్లో ప్రతిబింబించకూడదు. కానీ చాలా హైకోర్టుల న్యాయమూర్తులు తమ తీర్పుల్లో వ్యక్తిగత విశ్వాసాలను చేరుస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అందుకు మినహాయిం పు కాదు. హైకోర్టు న్యాయమూర్తుల విషయానికి వస్తే-రాజస్థాన్, మద్రా స్ హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత విశ్వాసాలు వారి తీర్పుల్లో ఎక్కువగా ప్రతిబింబిస్తున్నాయి.

రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి మహేశ్ చం ద్ర శర్మ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ ప్రజాహిత కేసులో సిఫార్సు చేశారు. అదేవిధంగా ఆవు మూత్రం, ఆవు పేడ వల్ల కలిగే ఉపయోగాలను తన తీర్పుల్లో వివరించాడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవుల నివాసం గురించిన కేసు అది. పరిష్కరించాల్సిన అంశం అది కాదు.

కానీ ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలను తన తీర్పుల్లో ప్రతిబింబింప చేశారు. అది రాజ్యాంగానికి అతీతమైన తీర్పు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ న్యాయవ్యవస్థను ప్లాట్‌ఫాం చేసుకొని తన వ్యక్తిగత అభిప్రాయాలను తీర్పుల్లో ప్రతిబింబింప చేశారు. ఇలా రెండు మూడు కేసుల్లో ఆయన చేశారు.

అందులో ప్రముఖమైనది రాసు వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసు. ఒక దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి అనుమతిని ఇవ్వమని పిటీషనర్ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు అందుకు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. ఆ సాంస్కృతిక కార్యక్రమం అయిపోయిన తర్వాత కేసు మళ్లీ కోర్టు ముందుకు వచ్చింది.

ఆ దశలో కోర్టు దేవాలయాలకు వెళ్లే వ్యక్తుల కోసం ఒక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. తీర్పునకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మరో రెండు గ్రూపులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్‌ను దాఖలు చేశాయి. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును తప్పుపట్టింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మీరట్ డెవలప్‌మెంట్ అథారిటీ కేసులో కొన్ని ముందు జాగ్రత్తలను కోర్టులకు నిర్దేశించింది.

కోర్టులు తమ పరిధిలో లేని అంశాలను విషయాలను పరిష్కరించకూడదు. విలువలను సమాజం మీద రుద్దకూడదు. అదేవిధంగా తమ ఇష్టాలను సమాజం ఆమోదించాలనే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఆ తీర్పుల విలువ తగ్గిపోతుంది.

అది సమాజానికి హాని కలిగిస్తుంది.వివాదంలో ఉన్న విషయాలను మాత్రమే కోర్టులు పరిష్కరించాలి. అంతేగానీ వివాదంలో లేని విషయాల జోలికి వెళ్లకూడదు. ఇది న్యాయవ్యవస్థ ఏర్పరిచిన నియమం. న్యాయమూర్తులు తమను తాము నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

న్యాయమూర్తులు చేసే ప్రతి ప్రకటనకు సరై న ఆధారాలు ఉండాలి. అవి వివాదంలో ఉన్న అంశాలు అయి ఉండాలి. కోర్టు హాలును తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే వేదికగా ఎవరూ ఉపయోగించుకోకూడదు. న్యాయమూర్తులు కూడా.

ఎందుకంటే న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. అది ఎందరినో ప్రభావితం చేస్తుంది. కొంతమంది న్యాయమూర్తులు తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను ఆధారం చేసుకొని కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది కూడా సరైంది కాదు.

కేసుల్లోని అంశాల ఆధారంగా తీర్పులు ఉండాలి. కామెంట్స్ కూడా. నిజానికి కామెంట్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాటికి తగు ఆధారాలుండాలి.

సార్వజనీనం చేయడానికి వీల్లేదు. దానివల్ల న్యాయమూర్తుల నిష్పక్షపాత వైఖరి పట్ల కూడా అనుమానం ప్రజ ల్లో ఏర్పడే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత కూడా తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. కోర్టు అధికారం అనేది ప్రజల విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది.

నిష్పక్షపాతం అనేది అన్నింటికన్నా ముఖ్యమైనది. ఇది ఆ కేసుకు సంబంధించిన పార్టీలకు మాత్రమే సంబంధించింది కాదు. అన్ని కేసులకు ఇది వర్తిస్తుంది. న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులే.

వారేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్లూ తప్పులు చేసే అవకాశం ఉంది. అయితే వాళ్లు చేసే తప్పిదాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది.

కోర్టు వ్యాఖ్యానాలు, వ్యక్తుల మీద కామెంట్స్ వాళ్ల పనితీరు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని కోర్టులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కోర్టు ముందులేని వ్యక్తుల విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఎందుకంటే అది సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధం కూడా.

న్యాయమూర్తుల నడవడిక గురించి న్యాయమూర్తులు ఏర్పరుచుకున్న నియమాలు బెంగళూరు సూత్రాలు. ఈ సూత్రాల ప్రకారం న్యాయమూర్తులు తమ విధులను ఎవరి పట్ల అనుగ్రహం లేకుండా, దురభిప్రాయం లేకుండా పక్షపాతం లేకుండా, ఎవరికి హాని కలుగచేయకుండా నిర్వహించాలి. ఈ ప్రవర్తన కోర్టులోనే కాదు, కోర్టు బయట కూడా ఉండాలి. ఈ విధంగా న్యాయమూర్తులు ఉండటం వల్ల కోర్టుల పట్ల విశ్వసనీయత పెరుగుతుంది.

న్యాయమూర్తి మీదనే కాదు న్యాయ వ్యవస్థపై ఈ విశ్వసనీయత పెరుగుతుంది. ఈ మధ్య ఓ కొత్త పద్ధతి వృద్ధి చెందుతున్నది. అదే నోటి మాట ద్వారా ఉత్తర్వులు ఇచ్చే పద్ధతి. ఇది ఎంతమాత్రం అభిలషణీయం కాదు.

నోటి మాట ద్వారా ఉత్తర్వులు ఇచ్చే పద్ధతి వల్ల విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉంది. తీర్పులు, ఉత్తర్వులు తగు కారణాలతో ఉండాలి. తగు కారణాలు ఉన్నప్పుడు తాము కేసు ఎందుకు ఓడిపోయామో, గెలిచా మో తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్పీలుకు వెళ్లడానికి అవకాశం ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది.

నోటి మాట ద్వారా ఉత్తర్వులు, తీర్పులు ఇస్తే పార్టీలకు నష్టం జరుగుతుంది. కోర్టుల మీద విశ్వసనీయత తగ్గుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం కూడా. మీడియాలో చర్చలు కూడా నిష్పక్షపాతంగా జరుగాలి.

విచారణలో ఉన్న వివాదాల మీద చర్చలు జరుగకుంటే మంచిది. అవి న్యాయమూర్తులపై పరోక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ చర్చలు న్యాయవ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉండాలి. ముందే చెప్పినట్లు లక్ష్మణరేఖ అన్ని వ్యవస్థలకూ ఉంది. దాన్ని అందరూ గుర్తించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*