ఇమ్రాన్‌, చైనా సంగతేంది? వాళ్లనెందుకు అడగవ్‌?

న్యూయార్క్‌ : కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్‌కు పశ్చిమ చైనాలోని వీగర్‌ ముస్లింల పరిస్థితి కనపడడం లేదా అని అమెరికా సూటిగా ప్రశ్నించింది. అక్కడ దాదాపు 10 లక్షల మంది ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్భంధంలోకి తీసుకుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీసింది. అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్‌ వెల్స్‌ పాక్‌ ప్రభుత్వానికి ఈ ప్రశ్నలు సంధించారు. గత సోమవారం ఇమ్రాన్‌ ఖాన్‌తో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనాలోని ముస్లింల పరిస్థితిపై స్పందించాలని కోరగా.. ‘చైనాతో మాకు ప్రత్యేక సంబంధాలున్నాయి. ఇలాంటి అంశాలు మేం ప్రైవేట్‌గా చర్చించుకుంటా’మని ఇమ్రాన్‌ బదులిచ్చిన విషయం తెలిసిందే.

కశ్మీర్‌లోని ముస్లింల విషయంలో ఒకలా, చైనాలోని ముస్లింల విషయంలో మరోలా వ్యవహరించే పాక్‌ ద్వంద్వ ప్రమాణాలని వెల్స్‌ ప్రశ్నించారు. ‘కశ్మీర్‌ కంటే చైనాలోని ముస్లింలే ఇంకా ఎక్కువ నిర్భంధంలో ఉన్నారు. పాకిస్తాన్‌ వాళ్ల గురించి ఎక్కువ కేర్‌ తీసుకోవాల’ని వెల్స్‌ వ్యాఖ్యానించారు. పశ్చిమ చైనా జిన్‌జియాంగ్‌​ ప్రాంతంలోని వీగర్‌ ముస్లింలను తీవ్రవాద భావజాలానికి దూరంగా ఉంచడానికి ఆ దేశ ప్రభుత్వం వెల్‌నెస్‌ సెంటర్లను తెరిచి పది లక్షల మందిని నిర్భంధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోని 30 దేశాలు ఖండించాయి. అయితే ఈ  ప్రచారాన్ని చైనా కొట్టిపారేస్తోంది. ఆయా క్యాంపుల్లో వారికి కొత్త నైపుణ్యాలు నేర్పించే ప్రక్రియ జరుగుతోందని  డ్రాగాన్‌ చెప్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*