ఉత్కంఠకు తెర

గత ప్రభుత్వ హయాంలోనూ బీజేపీకి శివసేన బయటినుంచి మద్దతు ప్రకటించి, నిత్య అసమ్మతివాదిగా కొనసాగింది. ఒకానొక దశలో బీజేపీకి కంట్లో నలుసుగా, ప్రధాన ప్రతిపక్షంగా విమర్శలు సంధించింది. ఇలాంటి కలహాల కాపుర వారసత్వమే కొనసాగి నేటి స్థితికి కారణమైంది. ఏదేమైనా ప్రజాప్రతినిధుల పాలనకు ప్రత్యామ్నాయం మరోటి లేదు. అనివార్య పరిస్థితుల్లో తప్ప రాష్ట్రపతి పాలన వాంఛనీయం కాదు. మహారాష్ట్ర రాజకీయంలో కొనసాగుతున్న మహా ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు దాదాపు గా ఇరువై రోజులుగా సాగుతున్న రాజకీయ డ్రామా ముగిసింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా తగిన సంఖ్యాబలాన్ని కలిగి ఉన్న దాఖలాలను రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సమర్పించకపోవటంతో రాష్ట్రప తి పాలనకు సిఫార్సు చేయటంతో ఈ పరిణామం చోటుచేసుకున్నది. గత నెల అక్టోబర్ 23న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి మహారాష్ట్ర రాజకీయం రోజుకో తీరుగా నిన్నమొన్నటి దాకా కొనసాగి సోమవారం నుంచి గంటగంటకూ మారుతూ తీవ్ర ఉత్కంఠ రేపింది. క్షణక్షణానికి మారిన రాజకీయ సమీకరణాలకు ఒక్క మహారాష్ట్రనే కాదు, దేశం యావత్తూ ఆసక్తి గా గమనించింది. ప్రస్తుత పరిస్థితికి ఏఒక్కరో కారణమని చెప్పటానికి లేదు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా చివరికి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పర్చాలన్న ప్రజాకాంక్షకు భిన్నంగా రాష్ట్రం లో రాష్ట్రపతి పాలనకు అన్ని పార్టీలు కారణమయ్యాయి.

ముఖ్యంగా సంఖ్యాబలంలో అతిపెద్ద పార్టీలుగా, గత ఎన్నికల నాటినుంచీ మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేనలే ఈ దుస్థితికి కారణమని చెప్పక తప్పదు. భావజాల పరంగా బీజేపీ, శివసేనలు హిందుత్వ సారూప్యపార్టీలు అయినా బీజేపీ అనుసరిస్తున్న ఆధిపత్యధోరణితో ఏర్పడిన శివసేనకు ఏర్పడిన అభద్రతాభావమే ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ప్రధాన హేతువు. గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ రాలేదు. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 105 స్థానాలు గెలుచుకొని అతిపె ద్ద పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షం శివ సేనకు 56 స్థానాలు దక్కాయి.

ప్రధాన ప్రతిక్షాలుగా ఉన్న ఎన్‌సీపీ 54 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 44 సీట్లతో సరిపెట్టుకున్నది. ఇతరులు మరో 29 స్థానాలో గెలుపొంది గతంలో ఎన్నడూలేని రాజకీయ అస్థిరతకు పునాది పడింది. అక్టోబర్ 23న ఫలితాలు వెలువడిన నాటినుంచీ మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయంలో ఏర్పడిన తగాదా రాష్ట్రపతి పాలన దాకా వచ్చింది. ఎన్నికలకు ముందునుంచే బీజేపీ శివసేన పార్టీలు సీట్ల పంపకంలోనూ, సర్దుబాటు విషయంలో నూ తీవ్రంగా ఘర్షణపడ్డాయి.

అప్పటినుంచే దేశంలో ఎక్కడైనా కావచ్చు కానీ, మహారాష్ట్రలో బీజేపీ పెద్దన్న పాత్ర వహిస్తామంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది శివసేన. అన్నట్లుగానే ఫలితాల తర్వాత అధికారాన్ని సమంగా పంచుకోవాలని, ముఖ్యమంత్రి పదవి చెరి రెండున్నరేం డ్లు ఉండాలని శివసేన గట్టిగా కూర్చున్నది. ఎన్నికలకు ముందు ఇదే వాగ్దానంతో కలిసి పోటీ చేశామని, ఇప్పుడు కుదరదంటే సహించేది లేదని శివసేన పట్టుబట్టింది. ఈ పదవి పంపకం కోసం ఈ రెండు పార్టీలు గత పదిహేను రోజులుగా మంతనాలు జరిపాయి.

ఎవరూ మెట్టుదిగకపోవటంతో చివరికి బీజేపీ చేతులేత్తేసింది. దీంతో శివసేనకు అవకాశం ఇస్తూ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. కానీ అనుకున్న సమయంలోపు చర్చల తంతు ముగియకపోవటంతో మరింత సమయం ఇవ్వాలని శివసేన గవర్నర్‌కు విన్నవించింది. కానీ సమయం ఇవ్వటానికి నిరాకరిస్తూ ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.

దీనికి సంబంధించి స్థానికంగా, జాతీయస్థాయిలో చర్చలు కొనసాగుతుండగానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ లేఖరాయటం, వెనువెంటనే కేంద్ర క్యాబినెట్ కూడా రాష్ట్రపతి పాలనకు నిర్ణయించటం ఆశ్చర్యకరం, గర్హనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాలనే కొనసాగటం ప్రజాస్వామ్య స్ఫూర్తి. దీనికి విరుద్ధంగా ఏమి జరిగినా, ఏ రూపంలో జరిగినా ఆక్షేపనీయమే. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి రెండురోజుల సమయం ఇచ్చినా సంప్రదింపులకు సుదీర్ఘ సమయం ఉండింది.

అయితే మిగతా పార్టీలకు గవర్నర్ ఆ సమయం ఇవ్వకపోవటం, ఎన్‌సీపీకి అయితే ఇచ్చిన గడువుకు ముందే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయటం పూర్తిగా ప్రజాస్ఫూర్తికి విరుద్ధమైనదే. నిజానికి మరికొంత సమయం ఉంటే ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏదో స్థాయిలో ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం పుష్కలంగా ఉన్నదనేది నిర్వివాదం. దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని కేంద్ర మంత్రిపదవి వదులుకొని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి నడిచే దిశగా శివసేన కదలటం గమనించదగినది. ఈ పరిస్థితులన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా గవర్నర్ చర్య మాత్రం, దక్కితే అధికారం బీజేపీకి దక్కాలి లేదంటే లేదనే తీరుగా వ్యవహరించటం సరికాదు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీనే అని చెప్పకతప్పదు. 2014 ఎన్నికల సందర్భంలోనూ సీట్ల పంపకం విషయంలో తలెత్తిన విభేదాలతో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేశాయి. గత ప్రభుత్వ హయాంలోనూ బీజేపీకి శివసేన బయటినుంచి మద్దతు ప్రకటించి, నిత్య అసమ్మతివాదిగా కొనసాగింది. ఒకానొక దశలో బీజేపీకి కంట్లో నలుసుగా, ప్రధాన ప్రతిపక్షంగా విమర్శలు సంధించింది.

ఇలాంటి కలహాల కాపుర వారసత్వమే కొనసాగి నేటి స్థితికి కారణమైంది. ఏదేమైనా ప్రజాప్రతినిధుల పాలనకు ప్రత్యామ్నాయం మరోటి లేదు. అనివార్య పరిస్థితుల్లో తప్ప రాష్ట్రపతి పాలన వాంఛనీయం కాదు. ఇదే ఇన్నాళ్ల భారత ప్రజాస్వామ్యం చెబుతున్న పాఠం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*