
చెన్నై: ‘‘ఎల్లకాలం గుర్తుండిపోయే అద్భుత క్షణం! చెన్నై టెస్టులో అశ్విన్ సెంచరీ.. మహ్మద్ సిరాజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన వేళ. డ్రెస్సింగ్ రూం మొత్తం ప్రశంసలు అందించేందుకు నిలబడిన ఆ సమయం’’ అంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇంగ్లండ్‌తో చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ హై క్లాస్ ఆటతో అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ భరతం పట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో 106(14 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అశ్విన్ హెల్మెట్ తీసి బ్యాట్ పైకెత్తి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న సిరాజ్ సైతం సంతోషంతో ఉప్పొంగిపోతూ బ్యాట్‌ను ఝులిపించాడు. ఇలా వీరిద్దరు మైదానంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే.. అటు స్టాండ్స్‌లో ఉన్న టీమిండియా సిబ్బంది హర్షధ్వానాలు చేస్తూ అశ్విన్‌ను విజయాన్ని ఆస్వాదించింది. బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోకు గంటలోపే మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక రెండో టెస్టు మూడోరోజు ఆటలో భాగంగా అశ్విన్, గిల్, రోహిత్ తలో ఒక సిక్సర్ కొట్టగా.. జాక్ లీచ్ బౌలింగ్‌లో సిరాజ్ భారీ హిట్టింగ్తో రెండు సిక్సర్లు బాదాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమిండియా విధించిన 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.
Leave a Reply