జడేజా లాంటి ఆటగాడు అరుదుగా దొరుకుతాడు: రైనా

ఢిల్లీ: రవీంద్ర జడేజా.. ప్రస్తుత క్రికెట్‌ తరంలో గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చకున్నాడు. తన కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న జడేజా ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్‌ షో కనబరిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ అన్నింటా తానే ముందుండి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్‌లో 62 పరుగులతో విధ్వంసం.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు.. ఫీల్డింగ్‌లో మెరుపు రనౌట్‌.. వెరసి ఒక ఆల్‌రౌండర్‌ అంటే ఎలా ఉంటాడో చూపించాడు.

విషయంలోకి వెళితే..టీమిండియా తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన  రైనా, జడేజాలు ఐపీఎల్‌లోనూ 2011 నుంచి కలిసి ఆడుతున్నారు. 2011 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్న వీరిద్దరు.. 2016లో సీఎస్‌కే బ్యాన్‌కు గురవడంతో రెండేళ్ల పాటు గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే సహచర క్రికెటర్‌ సురేశ్‌ రైనా జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

”జడేజా లాంటి క్రికెటర్‌ అరుదుగా దొరుకుతుంటాడు. అతను మంచి హార్డ్‌వర్కర్‌.. నా దృష్టిలో ఇప్పుడు నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌. ఆటలో ఎంత మంచి ప్రదర్శన చేసినా అతి చేయకుండా పద్దతిగా ఉంటాడు. జడేజాలో నాకు నచ్చిన గుణం అదే. ఇక ఫీల్డింగ్‌లో అతను పెట్టే శ్రమ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మైదానంలో మెరుపువేగంతో కదిలే అతను క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్ప గల సమర్థుడు. మ్యాచ్‌ మనకు అనుకూలంగా లేదన్న సమయంలో ఒక మెరుపు క్యాచ్‌ లేదా రనౌట్‌తో ఆటను మార్చేస్తాడు. అందుకే అతనితో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడు సంతోషాన్నిస్తుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. రైనా మాట్లాడిన వీడియోనే సీఎస్‌కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా ఢిల్లీ వేదికగా సీఎస్‌కే మరికొద్దిసేపట్లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ఆడనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*