దవాఖానల దుస్థితి

గ్రామీణ పేదలు వెళ్ళే దవాఖానల్లో వసతులుండవు, వైద్యులు ఉండరు, మందులుండవు, పరీక్షా పరికరాలు ఉండవు. విద్యుత్‌, నీటి సౌకర్యాలుండవు, పరిశుభ్రతా ఉండదు. దీంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్ళక తప్పడం లేదు. 25 వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలె. కానీ మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ర్టాలలో 45 వేల నుంచి 76 వేల మందికి ఒకటి లెక్కన ఈ కేంద్రాలున్నాయి. ఇక రాజస్థాన్‌లో జనాభా పలుచగా విస్తరించి ఉండేచోట్ల, గిరిజన ప్రాంతాలలో ఉండే పేదలకుఅనారోగ్యం ఏర్పడితే వైద్యంలభించడం కష్టం.

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలోని జేకే దవాఖానలో నెల రోజులలోనే దాదాపు వంద మంది మరణించడం దిగ్భ్రాంతికరం. ఈ ఒక్క నెల, లేదా ఈ ఏడాది మాత్రమే కాదు, గత ఐదారేండ్లుగా ఈ దవాఖానలో ఏటా దాదాపు వెయ్యిమంది మరణిస్తున్నారనేది బాధాకరమైన వాస్తవం. వైద్యుల నిర్లక్ష్యం వల్ల కాకుండా వసతుల లోపం వల్లనే మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. ఎక్కువమంది శిశువులు చలికి తట్టుకోలేక మరణించారనేది తెలిసినప్పుడు మరింత బాధ కలుగుతుంది. జేకే దవాఖాన మరణాలు రెండు మూడేండ్ల కిందట ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో శిశు మరణాలను గుర్తుకుతెస్తున్నాయి. గోరఖ్‌ఫూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలో ఆక్సిజన్‌ వసతి లేకపోవడం వల్ల ఐదు రోజుల్లోనే 72 మంది పిల్లలు మరణించారు.

ఇదే దవాఖానలో ఏడాదికాలంలో వెయ్యిమంది బాలలు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడైంది. ఉత్తర ప్రదేశ్‌ కానీ, రాజస్థాన్‌ కానీ రాష్ట్రమేదైనా ప్రభుత్వ దవాఖానల్లో దుస్థితికి అద్దం పడుతున్నాయి. గోరఖ్‌పూర్‌ విషాదం తర్వాత రాజకీయపక్షాలు అప్రమత్తమైతే ఇప్పుడు జేకే దవాఖాన విషాదం జరుగకపోయేది. కానీ రాజకీయ నాయకులు పరస్పరం బురద జల్లుకోవడమే తప్ప ప్రజా ప్రతినిధులుగా వైద్యరంగంలో పరిస్థితులను మార్చాలన్న తమ బాధ్యతను గుర్తించడం లేదు.

గత నెలలో ఈ మరణాల వార్త సంచలనం సృష్టించినప్పుడు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ బృందం జేకే దవాఖానను సందర్శించింది. కిటికీ తలుపులు పగిలిపోయి ఉన్నాయనీ, ఆవరణలో పందులు తిరుగుతున్నాయనీ, సిబ్బందికి తీవ్ర కొరత ఉన్నదనీ వెల్లడించింది. డెబ్బయి శాతం వెచ్చదనపు యంత్రాలు పనిచేయడం లేదనీ, నర్సుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నద నీ, ఆక్సిజన్‌ గొట్టం లేదని తమ నివేదికలో వివరించింది. శిశు మరణాలకు అలక్ష్యం కారణం కాదనీ, తగిన వసతులు లేవని స్పష్టం చేసింది.

ఈ దవాఖానలో గత ఆరేండ్ల వివరాలు చూస్తే అటూఇటుగా ప్రతి ఏటా వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్యం పట్ల అనుసరిస్తున్న విధానాల వల్ల తలెత్తిన సమస్య ఇది. శిశువులకు సాధారణ అనారోగ్యం ఏర్పడితే, దగ్గరిలోని ప్రాథమిక చికిత్సా కేంద్రాలలో చేర్చుకోవా లె. కానీ ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రాలను నిర్ల క్ష్యం చేయడం వల్ల కోటాలోని ఈ జేకే పెద్ద దవాఖానకు రోగులను తీసుకువస్తున్నారు.

దరిదాపు ల్లో ఈ స్థాయి దవాఖాన లేకపోవడం వల్ల సమీపంలోని మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి కూడా రోగులను తీసుకువస్తున్నారని అంటున్నారు. జేకే దవాఖాన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కోట- బుండి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దవాఖాన లో మరణాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైద్య పరికరాలు, తగినంత స్థలం లేకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.

మొత్తం జేకే దవాఖానను ఆధునీకరించాలె. నలభై ఎనిమిది గంటల్లోనే ఎంతో మంది మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలె, వెంటనే చర్యలు తీసుకోవాలె’ అని సూచించారు. ఓం బిర్లా దవాఖానలోని పరిస్థితులను బాగానే గ్రహించారు.

కానీ ఆయన లోక్‌సభలో సాధారణ సభ్యుడు కాదు. స్పీకర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తి కనుక కొంచెం తన పరిధిని విస్తరించుకొని దేశంలోని దవాఖానల పరిస్థితి తెలుసుకోవడానికి ఆసక్తి చూపితే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల వల్ల సగటున లక్ష మందిలో 178 మంది మరణిస్తుంటే, మన దేశంలో సగటున 253 మంది ప్రాణాలు విడుస్తున్నారు. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కన్నా మన దేశ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఓసీఈడీ అధ్యయనంలో వెల్లడైంది.

సగటు ఆయుర్ధాయంలో కూడా మన పొరుగుదేశాల కన్నా వెనుకబడి ఉన్నాం. మరోవైపు నీతి ఆయోగ్‌ మాత్రం ప్రభుత్వ నిధుల కన్నా, ప్రైవేటు వైద్యం, బీమా రంగాలను బలోపేతం చేయాలని సూచిస్తున్నది. క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులు మనదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. బాలింత మరణాలు కూడా మన దగ్గరనే ఎక్కువగా ఉన్నాయి.

శిశు మరణాలు కూడా ఎక్కువే. జేకే దవాఖాన దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానల పరిస్థితికి మచ్చుతునక. బడ్జెట్‌లో కేటాయింపే తక్కువగా ఉన్నప్పుడు ఇక చికిత్సా వసతులు ఎట్లా ఏర్పడుతాయి! గ్రామీణ పేదలు వెళ్ళే దవాఖానల్లో వసతులుండవు, వైద్యులు ఉం డరు, మందులుండవు, పరీక్షా పరికరాలు ఉండవు.

విద్యుత్‌, నీటి సౌకర్యాలుండవు, పరిశుభ్రతా ఉండదు. దీంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్ళక తప్పడం లేదు. 25 వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలె. కానీ మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ర్టాలలో 45 వేల నుంచి 76 వేల మందికి ఒకటి లెక్కన ఈ కేంద్రాలున్నాయి.

ఇక రాజస్థాన్‌లో జనాభా పలుచగా విస్తరించి ఉండేచోట్ల, గిరిజన ప్రాంతాలలో ఉండే పేదలకు అనారోగ్యం ఏర్పడితే వైద్యం లభించడం కష్టం. పేదవారు అనారోగ్యం వల్ల అప్పుల పాలవుతున్నారనేది వాస్తవం. ఇది ఒక జిల్లా యంత్రాంగమో, రాష్ట్ర ప్రభుత్వమో పట్టించుకుంటే అయ్యేది కాదు. పార్లమెంటు చర్చించవలసిన తీవ్రమైన అంశం. జేకే దవాఖాన దగ్గర తల్లుల శోకానికి పార్లమెంటులోని పెద్దల మనసు కరుగుతుందని, పేదల ఆరో గ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని ఆశిద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*