దేవినేని వల్ల వల్లభనేని వంశీ రాజీనామా..?

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ తాజాగా తన పదవికి – టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత – మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ పైకి చాలా సాఫ్ట్ గా ఉంది. చూసేందుకు ఎక్కడా ఎలాంటి విమర్శలూ కనిపించడం లేదు. తన ఆవేదనను – జరిగిన పరిణామాలను మాత్రమే ఆయన లేఖలో ప్రస్తావించారు. దీనికి చంద్రబాబు కూడా తిరిగి ప్రత్యుత్తరం రాశారు. ఇది పైకి కనిపిస్తున్న విషయం. కానీ వంశీ రాసిన లేఖను కొంత ఆలోచనా దృష్టితో చూస్తే.. చాలా విషయాలు మనకు అర్ధమవుతున్నాయి.

అదే సమయంలో చంద్రబాబుకు ఆయన చురకలు అంటించిన విషయం కూడా స్పస్టంగా కనిపిస్తోంది. పార్టీలో తనకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన మెత్తటి మాటలతో వెల్లడించారు. అదే సమయంలో పార్టీలో తనకు జరిగిన పరాభవాన్ని కూడా ఆయన వివరించారు. తాను గతంలో గన్నవరం నుంచి పోటీ చేసి ఉంటే గెలిచేవాడినని – కానీ – విజయవాడ ఎంపీగా పోటీ చేయడంతో పరాజయం పాలయ్యానని ప్రారంభించారు. అంటే.. నిజానికి ఏ పార్టీలో అయినా.. అధినేత ఇష్టం లేకుండా ఎవరికీ టికెట్ లభించదనే విషయం తెలిసిందే.

దీనిని బట్టి.. వంశీ తన పరాజయం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అప్పటి ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోయారనేది కూడా వాస్తవం. అంటేతాను అప్పట్లోనే గన్నవరం టికెట్ ఇవ్వమని అడిగానని – అయినా కూడా తనకు ఈ టికెట్ ఇవ్వకపోవడం – తనను ఎంపీగా పోటీ చేయాలని బలవంతం చేయడం వల్లే. తాను ఓడిపోయానని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా ప్రస్థావించారు. జిల్లా పార్టీ తనకు సహకరించలేదని వంశీ తన లేఖలో కుండ బద్దలు కొట్టారు. ఇది నిజమే. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ.. పార్టీలో వంశీ కి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు.

మాస్ లీడర్ అయిన వంశీ.. స్థానికంగా గట్టి పట్టు సంపాయించుకున్నారు. అయితే జిల్లాలోని వర్గ పోరులో తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా పట్టు సంపాదించే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చాలా మంది నాయకులను ఆయన అణిచేశారనేది వాస్తవం. ఈ బాధితులలో వంశీ కూడా ఒకరు. ఆయన రైతులకు సంబంధించి సమస్యపై నేరుగా సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సచివాలయానికి వెళ్లిన సమయంలో ఉమా ప్రోద్బలం వల్లే ఆయనకు కనీసం లోపలికి అనుమతించలేదన్న టాక్ అప్పట్లో వినిపించింది. ఇలా తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని సుతిమెత్తగా వంశీ వివరించారు.

చివరకు సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జిల్లా అధికారులతో ఇబ్బంది పడ్డ వైనం కూడా అప్పట్లో చెప్పుకున్నారు. గన్నవరం అభివృద్ధి పైళ్లను జిల్లా అధికారులతో మాట్లాడి ఉమానే తొక్కిపెడుతన్నారని అప్పుడే వంశీ సన్నిహితుల వద్ద వాపోయేవారట. ఇక ఇప్పుడు గెలిచిన తన కన్నా మళ్లీ బాబు ఉమా కే ప్రయార్టీ ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదు. అదే సమయంలో ఆయన తాను ఎలాంటి పోరాటాలు చేసిందీ కూడా వివరించారు. పార్టీ సహకరించక పోయినా.. కాంగ్రెస్తో కలిసి అనేక ఉద్యమాలు చేశానని చెప్పుకొచ్చారు మొత్తంగా వంశీ లేఖలోని లోతైన ఈ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే. ఆయన పార్టీలో ఉండగా అనుభవించిన బాధ తెరమీదికి వస్తోంది అంతే తప్ప.. చంద్రబాబును ఆయన ఎక్కడా కొనియాడిన సందర్భం లేక పోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*