నాడు వైఎస్ఆర్ ..నేడు జగన్ ..ఏంచేశారంటే ?

ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజారిటీ తో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ..గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులని సవరిస్తూ పోతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అర్చకులకు పదవి విరమణ నియమాన్ని అమలు చేసింది. దీనిపై చాలామంది అర్చకులు మండిపడ్డారు. ఈ నిబంధనల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు గారిని పదవి నుండి తొలగించారు. ఈ విషయం పై అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. దీనిపై ప్రస్తుత సీఎం జగన్ ..వైసీపీ అధికారంలోకి వస్తే అర్చకులకు పదవి విరమణ అనే నియమాన్ని తీసేస్తామని చెప్పారు.

ఇక అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్చకుల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ నిబంధనను తొలగించి ..వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వృత్తిని వైఎస్ జగన్ పునరుద్ధరించారు. దీనితో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆగమ సలహాదారునిగా ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. పదవీ విరమణ చేసిన తరువాత రమణ దీక్షితులు శ్రీవారిని దర్శించుకోబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

రాజు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుందనే విషయం చరిత్రలో విన్నామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని రమణ దీక్షితులు తెలిపారు. సనాతన ధర్మాలు ఆచార వ్యవహారాలను సక్రమంగా పాటిస్తూ ప్రజల మేలు కోరే పాలకుల సంరక్షణలో ఆ రాజ్యంగానీ ప్రాంతంగానీ సుభిక్షంగా ఉంటుందని పురాణాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డాయని అన్నారు. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రాహ్మణ సమాజానికి ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటి కంటే ఎక్కువే అమలు చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రం దేశ క్షేమం కోసం దేవుళ్లకు పూజలు చేసే అర్చకుల కష్టాలను గుర్తించి వారి కోసం ఏదో చేయాలనే తపన గతంలో  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో కనిపించిందని ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు పాటు వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రతి ఒక్క అర్చకుడు కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. మరో వారం రోజుల్లో తాను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలను స్వీకరిస్తానని రమణ దీక్షితులు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*