శాశ్వత పరిష్కారం చూపాలె

భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర, శాశ్వతచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్య ఘటన యావత్‌రాష్ర్టాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయారెడ్డిని కాపాడబోయి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ డ్రైవర్ గురునాథం కూడా మరణించడం బాధాకరం. ఈ సంఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. భూ సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం పడుతున్న ఇబ్బందులు అనేకం. భూ సమస్యల శాశ్వత పరిష్కారాని కి, మెరుగైన భూ పరిపాలన కోసం తక్షణ చర్యలు తక్షణ అవసరం. ఏ భూమి రికార్డూ భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూ రికార్డుల్లోని వివరాలకు భరోసా లేదు. భూ హద్దులు తెలిపే పట్టాలు లేవు. ఉన్న భూములకు హద్దురాళ్లు లేవు. ఏ భూమి సమస్యకు ఎవరి దగ్గరికి, ఏ విధంగా వెళ్లాలి, ఎంతకాలంలో పరిష్కరించాలనే విషయాలపై స్పష్టత లేదు.

లెక్కకు మిక్కిలి భూ చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాల్లో గందరగోళం అనేక సమస్యలకు కారణమవుతున్నది. 40 ఏండ్లకొకసారి జరుగాల్సిన భూ సర్వే ఎనభై ఏండ్లయినా జరుగలేదు. అసంపూర్ణంగా మిగిలిన చారిత్రక భూ చట్టాల (సీలింగ్, టెనెన్సీ, ఇనాం) అమలు వాస్తవ పరిస్థితికి అద్దంపట్టని భూ రికార్డులున్నాయి. పేదలకు అండగా ఉన్న పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ అటకెక్కింది.

న్యాయ సేవాసంస్థల నుంచి సాయమందటం లేదు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసుల సమీక్ష జరుగటం లేదు. సివిల్ కోర్టుల్లో 66 శాతం కేసులు భూ తగాదాలే. వీటికి తోడు, భూపరిపాలన వ్యవస్థలోని కొందరు వ్యక్తుల చట్టవిరుద్ధ పనులు, యంత్రాంగంపై పలురకాల ఒత్తిళ్లు ఇలా ఎన్నోరకాల కారణాలున్నా యి.

భూ చట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్ ను రూపొందించాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావా లి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేయాలి. ప్రజల భాగస్వామ్యంతో భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి. అప్పుడే భూ వివాదాలు, అమానుషాలు తగ్గు తాయి. – ఎం.సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణులు, న్యాయవాది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*