సీఎం స్పందనతో మాకు ఊపిరి: కార్మిక సంఘాలు

విశాఖపట్టణం: కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.సుమారు గంట 20 నిమిషాలు సీఎం జగన్‌ కార్మిక నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కు అవసరమైన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. పొస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. పోస్కో ప్రతినిధులు కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోస్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో సీఎం జగన్‌ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్‌ గనులున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తాము నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవమని, కడప, కృష్ణపట్నం, భావనపాడు చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్లు సీఎం జగన్‌ వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*