హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్‌ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  మొత్తం 223 ఓట్లు పోల్‌ కాగా, అజహర్‌కు భారీ స్థాయిలో ఓటింగ్‌ పడింది. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్‌తో పాటు దిలీప్‌ కుమార్‌, ప్రకాష్‌ చంద్‌ జైన్‌లు పోటీ పడ్డారు. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్‌ జైన్‌కు 73, దిలీప్‌ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి. అయితే  హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్‌ ఘన విజయం సాధించడంతో అతని కల ఫలించినట్లయ్యింది.

రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్‌ నామినేషన్‌ను ఆమోదించలేదు. అయితే  హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్‌ విజయం సాధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*